ఇదేం విధ్వంసం బాబోయ్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వైభ‌వ్‌

  • శ్రీలంక-ఏతో ట్రై-సిరీస్ ఫైనల్‌లో చెలరేగిన భారత యువ సంచ‌ల‌నం
  • కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైనం
  • 21 ఏళ్ల క్రితం నెలకొల్పిన కౌశల్య వీరరత్నే రికార్డు బద్దలు
  • మొత్తం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం
  • ఆరు పరుగుల తేడాతో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ సెంచరీ చేజార్చుకున్న వైభవ్
భారత క్రికెట్‌లో ఓ కొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఓ యువ కెరటం అంతర్జాతీయ స్థాయి బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జ‌రుగుతున్న‌ ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్‌లో శ్రీలంక-ఏ జట్టుపై భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్ ఐదో బంతికే ఫోర్‌తో తన పరుగుల ఖాతా తెరిచిన వైభవ్, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. శ్రీలంక బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. ఎదుర్కొన్న ప్రతీ బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపించాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో 2005లో శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే 12 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలైంది. 21 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఈ రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు.

లీగ్ దశలో పెద్దగా రాణించలేకపోయిన వైభవ్, ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరంభంలో పేసర్లను లక్ష్యంగా చేసుకుని లెగ్ సైడ్ బౌండరీలు బాదిన అతను, ఫీల్డింగ్ మార్పుల తర్వాత ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బంతిని బౌండరీ దాటించాడు. మంచి బంతులను కూడా అలవోకగా సిక్సర్లుగా మలచడం అతని బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ముఖ్యంగా ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అతను బాదిన మూడు సిక్సర్లు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి.

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (29 బంతుల్లో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ రికార్డు) సమం చేసేలా కనిపించాడు. అయితే, సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మిడ్-ఆఫ్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే అతను 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. సెంచరీ చేజారినప్పటికీ ఈ 15 ఏళ్ల కుర్రాడి అసాధారణ ప్రదర్శన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. 

Vaibhav Suryavanshi
Fastest List A Half Century
India vs Sri Lanka Tri Nation Series
Cricket World Record
Dambulla Tri Nation Final
Indian Young Cricketer

More Telugu News